26, సెప్టెంబర్ 2012, బుధవారం

అలిసి సొలిసి

వేదన వాకిట విచ్చిన పూలని వాసన దాచుకోగలవా....
మండిన వేసవి మల్లెల మొగ్గలు పూయక రాలిపోగలవా....
నిదురకు వెన్నెల దారులు చూపితే కనులను మరిచిపోగలదా....
నువ్వని నేనని భేదం చూపితే హృదయం ఆపుగోగలనా....
మళ్ళీ పిలిచినా పలుకవు కనుక మౌనంలో మనగలనా....
విచ్చిన పూల వాసన పరిచి.... మల్లెల మొగ్గల దారులు పోసి....
వెన్నెల రేయి కన్నులు తెరచి.... నువ్వే నాకు హృదయమని....
పిలిచి.... పిలిచి.... అలిసి.... సొలిసి..... మౌనంగా... వేచి వేదనైపోతున్నా.....
 

20, జులై 2012, శుక్రవారం

ఎదురుచూస్తున్నా...

పిలిచానని అనుకున్నా నిను చేరని నా పెదవుల సడి నాకు వినపడగానే...
గమనించావనుకున్నా నిను తాకని నా ఊపిరి వేగం నాకు తెలియగానే...
కాలం నన్ను దాటి వెళ్లిపోయిందని చూడక వేచే ఉన్నా...
మౌనం మాటయ్యే క్షణమే ఇక రాదని తెలిసున్నా...
నా కన్నుల కౌగిలిలో నీ కలలే కావ్యాలై...
ఎదురుచూస్తున్నా...

9, ఏప్రిల్ 2012, సోమవారం

మళ్ళీ వీచిన గాలిలో

మళ్ళీ వీచిన గాలిలో నువ్వే నిండిన పరవశం
నిన్నే పిలిచిన ఊహాలో ప్రతిదీ కదిలిన కలకలం
వెంట నడిచే దారికైనా చెప్పలేనే నిన్ను చేరే ఊపిరేదో
నన్ను విడిచే ఆశలైనా చేరలేదా నిన్ను తాకే గాలిలోనే

నీవో నేనో

నీవో నేనో ఏమైనామో...
కధలో కదిలే సుధలైనామో...
ఈ గాలిలో ఏ మెరుపులో...
ఈ వేళలో మైమరపులో...
మళ్ళీ మళ్ళీ పిలిచే హృదయం...
అలసిన క్షణమే అందే స్నేహం...

26, మార్చి 2012, సోమవారం

నీ శ్వాసకు నా ఊపిరే...

నీ నిదురకు నా మెలకువ జత చేసానే...
నీ కలలకు నా తేనెల శృతి చేసానే...
ఈ నేల నింగిలో ఏ పువ్వు నవ్వులో...
ఆనందం వెతికినా అది నీ మదికి నా కానుకే...
ఈ గాలి జోలలో ఏ గొంతు పాటలో...
ఆలాపన వింటినా అది నీ శ్వాసకు నా ఊపిరే...


23, మార్చి 2012, శుక్రవారం

ఉలికిపడే హృదయం

ఉలికిపడే హృదయం ఊహలు కరిగించీ...
మదనపడే నయనం కలలను కవ్వించీ...
తలగడ అడిగే తపనల ప్రశ్నలు...
అలజడి కలిగే ఆశల బరువులు...
సడిచేయక చేరవా సందెవేళ నా సరిగమ లాహిరిలో...
వదిలేయక పాడవా తేనెలవేళ  నా పదనిస అల్లరిలో...


15, మార్చి 2012, గురువారం

నన్నే తడిపే నీ పేరు ప్రేమగా...

కాలాలన్నీ ఆగనీ...మౌనాలన్నీ కరగనీ...
నా హృదయం ఈ క్షణమే కాగితమైపోనీ...
దూరాలన్నీ తరగనీ...స్నేహాలన్నీ మిగలనీ...
నీలాకాశం నా కలమై కవితలు రాయనీ.... 
మెరిసే కలల మాటున కురిసే కాలం తరమగా...
నన్నే తడిపే నీ పేరు ప్రేమగా...

5, మార్చి 2012, సోమవారం

నను తాకే చిరుగాలులు...

కదిలే నీ కురులేగా ఈ గాలికి పరుగిచ్చెనే...
నీలాల నీ కళ్లే ఈ రేయికి వెలుగిచ్చెనే...
నడిచే నీ అందెల్లో సడులేగా ఈ రాగాల సరిగమలు...
కురిసే నీ నవ్వుల్లో సిరులేగా ఈ లోకాన  పదనిసలు...
ప్రతి చోట ప్రతి పూట నను తాకే చిరుగాలులు...



కలగంటున్నా...

కలగంటున్నా కలిసే ఉన్నా..
విడిపోతున్నా వీడలేకపోతున్నా...
మళ్ళీ విన్నా  మనసేమన్నా..
నువ్వేమన్నా నమ్మలేకపోతున్నా...
ఆ రోజే నీ చెంత వదిలేసున్నా...
నా ప్రాణం ఇపుడింత కలవరమయ్యేనా...

వెన్నెల గదికి దారెటో...

నీ మదినే దాచిన ఆ వెన్నెల గదికి దారెటో...
మరిచానే మళ్ళీ కల గని  జ్ఞాపకాల జడిలో...
నేనెవరో తెలియని ఈ కాలమెంతో ఏమిటో...
పిలిచానే నా జత చేరని స్వాగతాల ఒడిలో...
వేకువలో నీ పేరే కలవరమౌతున్నా....
నా మదిలో ఓ ఆశే ఇంకా మిగిలున్నా...

 

1, మార్చి 2012, గురువారం

ప్రియనేస్తం నువ్వే...

కదిలించే కలలేవో నడిరేయి జతలో...
మదిదోచే నీ నవ్వే వరమైన శృతిలో...
నా కోసం విరిసావే ప్రియరాగం నువ్వే...
నాలోన నిలిచావే ప్రియనేస్తం నువ్వే...
గతమైన పూదోట చూపించే బాట...
సగమైన  ఈ ప్రేమ వినిపించే పాట...

27, ఫిబ్రవరి 2012, సోమవారం

విచ్చుకున్న వెన్నెలా...

విచ్చుకున్న వెన్నెలా... వినవే నా మాటని...
చల్ల గాలి గంధం... చెంత చేరి పరువం...
ముంచే తగువా... చెబితే వినవా...
వెన్నెలా... వెన్నెలా... విచ్చుకున్న వెన్నెలా...
పై పై పంతం... పిలిచే నీ మది ఆశ విన్నానులే...
లో లో దాగిన... కలవరమైన నా పేరు నీ గుండెలో...
వెల్లువైన వెన్నెలా... వేదికైన వెన్నెలా...
సన్నజాజి పువ్వులా... విచ్చుకున్న వెన్నెలా...

16, ఫిబ్రవరి 2012, గురువారం

చెలి నీ వైపేనా...

ఏ వైపో.. ఏమో.. ఏ చోటో.. ఏమో..
నా శ్వాస సాగే ఆ సరిహద్దే లేని...
పదముల పయనం పరువం...
స్వరముల సరిగమ సంగమం...
చెలి నీ వైపేనా.. సుడిగాలై రానా...
ఇది నీ పాటేనా..జడివానై రానా...

15, ఫిబ్రవరి 2012, బుధవారం

నీ చెంత...

నీ చెంత చేరగా చామంతి పూవులు...
నీ శ్వాస సోకగా సన్నజాజి నవ్వులు...
చేరుకున్నా చెప్పలేని చిన్న చిన్న మాటలు..
చెంత లేక చిన్నబోయే నా మనసు ఊసులు...
వేడుకైన వేళలోన జల్లు కురిసే మల్లెలు...
ఊపిరంత ఆగిపోయే తీయనైన ఊహలు...

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వెళుతున్నా...

వెచ్చని కన్నీరే వెలిసిన ఈ వాన..
వేదన ఇది కాదా  ఓడిన నా  ప్రేమ...
ఈ చోటే ఈ కధని తరాల తరగని చరిత్ర ఒడిలో దాచి సాగిపోతున్నా...
ఈ కధలో నీ మదిలో దొరకని నా పేరు వీడి  వెళుతున్నా...
నువ్వే ...నీ నవ్వే నాలో... ప్రాణం నింపే శాశ్వత స్వాగతమని తెలిసీ....

8, ఫిబ్రవరి 2012, బుధవారం

అడుగు..

తలపుల నదిలో తపనల నావని తరిమిన మదినడుగు...
స్వరముల గదిలో విరిసిన పదముల వెల్లువ జతినడుగు...
తలగడ మదిలో కురిసిన వెన్నెల కన్నుల జ్ఞాపకమడుగు...

నిన్నే తలచిన వ్యధలో నలిగిన ప్రాణం వేదన పలికే పాటకి పల్లవి కోసం...
అల్లిన ఈ మల్లెల మాల నీ మది చేరే చల్లని వేళ....
అడుగు... నీ కోసం వేచి ఉన్నానా అని... అడుగు...


6, ఫిబ్రవరి 2012, సోమవారం

ఎంతిష్టం

నేనంటే ఎంతిష్టం అని నేను నిన్ను అడిగినప్పుడల్లా నా గుండెలో మోగే తీయని  అలజడి...
ఎలా చూపను...
అదుగో చూడు ఆ వినీలాకాశం పరుచుకున్న చోటంత ఇష్టం...
ఇలా చూడు ఈ వెన్నెల పూలు రాలే రేయంత ఇష్టం...
గల గల మని పరవళ్ళు తోక్కే సెలయేరు చేసే సవ్వడంత ఇష్టం...
మంచు మీటిన సన్నజాజి పువ్వులంత ఇష్టం...
వాన ముద్దుల వేడి ఊపిరి తాకుతుంటే పరవశించే వసుధ  కన్నుల వలపంత  ఇష్టం...
అని నువ్వు చెప్పాలని... అది నేను వినాలని...
ఎగసి పడే నా ప్రతి అడుగుని ఆపాలనే నా ప్రయత్నంలో ఎప్పుడూ నేను ఓడిపోయి..
నిన్నే తలచి తలచి నీ ముందు నిలిచి వేచి ఉన్న నా అల్లరి మనసుని నీకు ఎలా చూపను...
ఎలా చూపను...


3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

మరువకు నేస్తమా...

సప్త సంద్రాల సాధనలో... స్వప్న సౌధాల ఊహాలలో...
వినీలాకాశ వేదికపై... ప్రతి క్షణం నర్తించే నా నేస్తమా...
మరువకు ఈ మరు మల్లెని...
నీకై స్వరపరిచిన  సిరి మువ్వని...


11, జనవరి 2012, బుధవారం

వరమివ్వాలి నువ్వు

చిరుగాలి తాకుతున్నప్పుడు
సిరిమల్లె విచ్చుకున్నప్పుడు
హరివిల్లు జల్లవుతునప్పుడు
మరుమల్లెల వానలో
మంచు ముత్యాల వేదికపై
నా కంటి ప్రేమ దీపాల వెలుగులలో
విరబూసిన జాజి పువ్వుల కానుక నీ యద చేర్చి
కోరుతున్నాను ఈ మనసు నీదేనని...
వరమివ్వాలి ఈ వేళ నీ మనసుని.....


10, జనవరి 2012, మంగళవారం

క్షణం క్షణం

క్షణం క్షణం కదలనంటోందేంటి ఈ కాలం
మరో క్షణం గడపలేనంటోంది నా హృదయం 
ఇవాళిలా పదే పదే మనసు అల్లరేమిటో
పెదాలలా మరి మరి పిలుపులాపవెందుకో 
పరిచయమున్న పదముల సవ్వడి మళ్ళీ మళ్ళీ వినాలని నాలోని అణువణువుకూ ఈ తొందరేమిటో

మళ్ళీ నువ్వు వస్తావని....

మళ్ళీ నువ్వు వస్తావంటూ నాకే నేను చెప్పుకున్నా....
నా కంటి పాపల తడిలో కరిగిన నీ రూపం చూపేటందుకు,
గాయపడిన మనసు తలుపు తెరిచేందుకు
మళ్ళీ నువ్వు వస్తావని,
వెన్నెల వెలుగులు తెస్తావని
ఆకాశమైన నా ఆశల పల్లకిలో నీ సేద తీర్చడానికే ప్రియా
వేచి ఉన్నాను.. ఇలాగే వేచి ఉంటాను మళ్ళీ నువ్వు వచ్చేవరకు....



మౌనంలో

బదులివ్వలేని మౌనాలలోన ఉన్నాను ప్రియతమా...
కనిపించి నాకు వరమియ్యమంటూ అడిగాను ప్రాణమా....
ఆశ లేని శ్వాసనై...  రాయలేని లేఖనై.....
మిగిలున్నానని  ఎలా చెప్పను నీకెలా చెప్పను...

9, జనవరి 2012, సోమవారం

కౌగిలి కానుక

నువ్వు వదిలి వెళ్ళిన విషం తాగుతూ....
నీ జ్ఞాపకాల ఊయలూగుతూ....
మల్లెలు, వెన్నెల, మబ్బులు, ఊహలు అనే పదాలు మరిచి
నువ్వు, నీ నవ్వు అని కలలు కంటూ....
కదలబోతే కనులు మూత పడుతున్నాయి....
నీ మీద నా ప్రేమ ఎంతో పాపం విషానికి తెలియదుగా.... అది పని చేస్తుంది.....
మళ్ళీ పుడితే నీ కౌగిలి కానుక ఇస్తావా....శాశ్వతంగా....

5, జనవరి 2012, గురువారం

ప్రతి క్షణం


ప్రతి క్షణం నీ తలపుల తలుపులు తెరుచుకుంటుంటే....
ఏ పనీ చేయలేక... శ్వాసైనా పీల్చలేక... తలుపుల తాళమేయలేక...
సతమతమైపోతున్న నా హృదయంలో ఒదిగిపోరావా......