31, జులై 2015, శుక్రవారం

కాలం తాకని ఓ నిరాకారీ...

పేరు లేని నిన్ను నేనెలా పిలుస్తానని నవ్వుకుంటున్నావు...
కనిపించనని నువ్వు అనుకున్నా, కనిపించవని ఎవరన్నా
నమ్మలేకున్నాను...
ప్రతి క్షణం వినిపిస్తూ, స్పర్శిస్తూ, అనుభూతిలో మునకేస్తూ...
కాలం తాకని ఓ నిరాకారీ...
చూస్తున్నాగా కనులు మూసినా మరి లేనిది ఎక్కడ
కలవరిస్తున్నాగా ప్రతి శ్వాసతో మరి మౌనం ఎక్కడ
దూరం, పయనం లేవని అనుకున్నా
పేరు, పిలుపు అక్కరలేదన్నా
ఏమన్నా నాతో నేను, నాలో నేను లిపి లేకనే చెబుతున్నట్టేగా...
కంటున్నా ఇలలోవన్నీ కలలాగా మరి నువ్వు కనిపిస్తున్నట్టేగా...

24, జులై 2015, శుక్రవారం

నిదురైన పోవు నా కనులు

మాటకు మౌనం భాషైనప్పుడు, శ్వాసని తాకే చల్లని గాలి వెన్నెల వర్షం కురిపిస్తుంటే
నువ్వేనా ఆ తిమ్మెరలో తడబడు నా పెదవులు తాకినది..
కనులకు, కాలం తెలియని కబురుల వెనుకే పరుగిడుతుంటే, మైమరిచి ఉంటే
నీదేనా ఆ అలికిడి త్వరపడి నా మనసుకు చేరినది..
ఎప్పటిదో ఈ నిమిషం నే వేచి ఉన్నది..
ఇప్పటికీ ఆ సమయం నను చేరకున్నది..
తరిమే స్వరమై దూరమైన దరి చేరడానికి నిదురైన పోవు నా కనులు..
సాగే నదిలా ఆగని పయనం చేయడానికి పురివిప్పుకోవు నా కలలు..


5, మే 2015, మంగళవారం

మనిషిని, నేను మనిషిని, గొప్ప మనిషిని.

జరుగుతున్నది జరగవలసిందే అని తెలిసినా
జరగబోవునది వేరుగా జరగాలని కోరుతుంటాను.
మార్చలేనిదని, మారబోదని తెలిసినా మార్చనందుకు తిడుతుంటాను.
మనిషిని, నేను మనిషిని, గొప్ప మనిషిని.

ప్రేమ అంటాను, గిరి గీస్తుంటాను
దాటనివ్వను, దాటితే ప్రేమించను.
ఆనందంగా ఉండాలని ఆజ్ఞాపిస్తుంటాను.
మనిషిని, నేను మనిషిని, గొప్ప మనిషిని.

అహంకారపు చెట్టు కింద అగ్నిలో ఆజ్యం పోసి
బ్రతికిస్తుంటాను. ఎందరినో ఆ అగ్నికి ఆహుతి చేస్తుంటాను.
మనిషిని, నేను మనిషిని, గొప్ప మనిషిని.

తెలుసుకుంటాను, తెలియనట్లుంటాను.
నమ్మకాన్ని కూడా అమ్ముకుంటుంటాను.
నవ్వుతున్నట్లు నటిస్తుంటాను.
మనిషిని, నేను మనిషిని, గొప్ప మనిషిని.

కనులు మూస్తాను, కలలు కంటాను.
కరిగిపోతుంటాను. నిజం నిప్పులా మదిని కాల్చినా
కనులు తెరువను, కలలు ఆపను.
మనిషిని, నేను మనిషిని, గొప్ప మనిషిని.

పిలుపు లేనిది, పలుకు కానిది,
ప్రాణమున్నది, ప్రశ్న అవనిదే పూజ అని తెలిసినా
నీకో పేరు పెడుతుంటాను,
ఎలుగెత్తి అరుస్తుంటాను.
మనిషిని, నేను మనిషిని, గొప్ప మనిషిని.

ఓ దైవం, మనిషిని, నేను మనిషిని, గొప్ప మనిషిని.




3, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఎవరో.. నీవెవరో.. నేనెవరో నీకు..

ఎవరో..  నీవెవరో..  నేనెవరో నీకు..
నిదురించే అక్షరాల ఆనందం కోసం
వెలిగించిన మాటలలో కనిపించావు
కాను కాను నేను కాను కవిని కాను
మది గదిలో దాగిన మౌనం నేను
గీసుకున్న గీత దాటలేని నన్ను
రాసుకున్న రాతలలో చూసుకుంటాను
వేళ కాదు ఇది నాకు
ఊపిరాపను ఆ వేళ వరకు
కదలలేను నిలువలేను నింగికెగరలేను
కాలంతో సాగే ఓ కెరటం నేను


కనులు మూయను నీ శ్వాసకు కావలి కాస్తూ

ప్రళయం పరుగులెత్తి వచ్చినా
ప్రాణం పయనించే పావురమైనా
కనులు మూయను నీ శ్వాసకు కావలి కాస్తూ
కాలమాపగలను నీ కనులలోకి చూస్తూ
విధి ఆజ్ఞకు తలవంచిన సమయములోన
వెనుతిరిగి నీ వాకిట వెన్నెలనవనా



15, జనవరి 2015, గురువారం

తపిస్తూ జీవిస్తున్నాను

కనులు తెరిస్తే కనిపిస్తాయి
కష్టమనిపిస్తాయి
కల కాని హాయిలో నిదుర లేని వేళలో 
వెన్నెల రాత్రైనా వెలుగుల పగలైనా
మరిచిపోయి తిరుగాడా విశాల విను వీధిలో
గాలిని చాపలా చుట్టుకుని హృదయానికి 
తాకని విషయాలెన్నో కన్నాను
కలతను చేరిపేసాను
మళ్ళీ మళ్ళీ చూడాలని తపిస్తూ జీవిస్తున్నాను