23, డిసెంబర్ 2014, మంగళవారం

కరిగి కడలైపోయాయి

ఆకులు పూవులైతే సంతోషించిన కనులకు
పూవుల గొంతుకలు తెగిన రోదన వినే వీనులేవి
కాదన్నా కనమంటే కలలెక్కడున్నాయి
వెన్నెల రాత్రి కన్నుల నదిలో కరిగి
కడలైపోయాయి
కధల చరితలో కాలమాగలేదు
కనులు తెరవక నిదురించాను
మూసిన రెప్పల మాటున మాయమయ్యాను

ప్రయాణమెపుడో ఆగింది

ప్రయాణమెపుడో ఆగింది
ఉనికే లేక తెగిపోయిన రూపం నేను
గడిచిన కాలపు భవిష్యత్తుకు భయపడుతున్నాను
శిధిలాలైన గోడలు మిగిలి
నిశబ్ధమైన బంధం కనిపించి
పలుకు లేక పదము కదలనంటే
గుండెలో మండే అగ్ని కణాలు
నిలువునా దహించివేస్తుంటే
ప్రయాణమెపుడో ఆగింది 

4, డిసెంబర్ 2014, గురువారం

నేను మరణించాను

నేను మరణించాను
నిన్నో మొన్నో ఎపుడో
కాల గర్భంలో కలిసాను
జీవితం చెప్పింది వేదన ఆయుష్షు ఎక్కువని
జ్ఞాపకం ఆగింది సాగే వారధి మూసుకుని
నేను మరణించాను
నేను మరణిస్తున్నాను
నేను మరణిస్తూనే ఉంటాను
పుట్టకుండానే... 

మాసాల మౌనం

మాసాల మౌనం వర్షాలు దాటి వేళ మించి పోయినా...
 రేయి వదలక రాలిపోయే నిమీషాల నీలాలు ఇంకినా...
కరిగిన నింగిలా మారిన నా హృదయం సడి ఆగినా...
పదే పదే నీ పేరు పలికే పెదవి ఊపిరాగినా...
తిరిగి చూసి తిమిరం తరమవే
తరచి చూసి తలపులు తెలుపవే

దిగంతాల నివాసీ

ఓ గగనవాసీ దిగంతాల నివాసీ 
దాచి ఉన్న దావానలం దారి మార్చకున్నా
తోడు లేని గుండెతో ఊపిరాడకున్నా
వ్యసనమైన వాకిట శిలనౌతుంటే 
మసిగా మారే నిశినౌతుంటే 
కనులు విప్పి చూడవే 
కలత నిదుర లేపవే 

2, డిసెంబర్ 2014, మంగళవారం

ఏమి చేయగలను

ఏమి చేయగలను
నలుపు రాత ఎలా చెరపగలను తెలుపు రాత ఎలా రాయగలను
వెనక్కెలా ప్రయాణించగలను విధి రాత ఎలా మార్చగలను
మరణ లేఖ నింపలేను జీవితానికి ప్రేమ లేఖ పంపలేను
చిగురించదని తెలిసిన మనసుకి ఏ వైపు నిలువగలను
ఏమి చేయగలను
ఊపిరాడనంతగా కౌగిలి ఇచ్చిన కన్నీరు
కాలంతో పయనించమంటే
రాతిరెలా గడపగలను
కనులనెలా మూయగలను

18, అక్టోబర్ 2014, శనివారం

వర్షించనీ నా కళ్లని

ఈ పరవశం ఈ పరిమళం నీ హృదయపు హాయి మధురిమలో
నా కోసమే నీవెక్కడో దాచి ఉంచిన జ్ఞాపకాలవిగో
నను తాకి ఈ గాలిలో మనసెందుకో నిను వెతికి
వెలి వేసిన ఈ గుండెని మన్నించవా మనసెరిగి
వర్షించనీ నా కళ్లని
నీ గుండెలో ఎగసిన మంటనార్పనీ
కదిలించనీ నా శ్వాసని
నీ గుండెలో నిండిన నా పేరు విననీ
త్వరత్వరగా జరిగినది త్వరితంగా ముగిసినది
తప్పేగా నా మదిది తప్పుకునే వీలేది
వేచి ఉండవలెనంటే ఊరుకోదు నా మది
రాసిపెట్టలేదంటే ఆగిపోదా ఊపిరి

మరణించే నిమిషమై

మదిలో ఎగిసే ఉద్వేగాలకు వయసే పెరుగుతున్నా
ఉద్వేగాలను దాచే మదికి వయసే తరుగుతున్నా
కాలానికి బంధీనై మౌనానికి రూపాన్నై
వినువీధిలో ఎగరలేక విశాల విహంగమై తిరుగలేక విలపించా
వివర్ణమైన వర్ణమై వినిపించని శబ్దమై విసిగిపోయా
వదలలేను నిలువలేను
మరణించే నిమిషమై సంతోషం రావాలని
వేల కొద్దీ నిమిషాల నిరీక్షణై శ్వాసించే నా గుండె కోత తుడిచే స్నేహమేది
ఒంటరిగా పుట్టాను ఒంటరినై పోయాను జ్ఞాపకాల తోడుగా వెళ్ళిపోతాను


12, ఆగస్టు 2014, మంగళవారం

వినగలదా నా మౌనం ...

మనసిక పలుకదని అలుగదని ఘడియ ఆగక పిలువదని తెలిసినా
ఈ నిమిషం వదలదే నా  ప్రాణం...
చలి వేణువు తాకదని తెర తీయని తిమిరం తప్పదని కలవరమా
ఓ క్షణమా నీ హృదయం...
వీడలేని వైశాఖం వీడుకోలు తెలిపితే వినగలదా నా మౌనం ...

పరిణామాలు ఎరుగవెందుకు...

అహాల ఊయలూగు, ఆడదాని హృదయ సీమ ఆసామీ...
మమత చీల్చుకున్నా మనిషివి కాలేదా...
వలపు పంచుకున్నా విలువలు కనలేదా...
అడుగు ముందుగా...
మనసు నిండుగా...
వారథివై నడపమని దివి నుండి పంపినా...
దిశను మార్చుకుని...
తరతరాల దశలు మారుస్తూ...
పతనం వైపు నడిచేవెందుకు...
పరిణామాలు ఎరుగవెందుకు...

8, ఆగస్టు 2014, శుక్రవారం

ఏది ఆ జీవం

బలహీన క్షణాలు బరువులైపోతుంటే...
రాయి లాంటి గుండె కరిగి ధారలైపోతుంటే...
కనులనెపుడు తడిమాను తడి తడిగా తగిలినవి...
మనసునెపుడు అడిగాను మునుపటిలా లేవు అని...
వేళ దాటి వేళ...
అడుగు వెనుక అడుగు...
వడివడిగా సాగి...
కాలాన కలిసి...
గమ్యాలు చేరినా...
ఏది ఆ జీవం...
ఎక్కడుంది జవసత్వం...