4, జులై 2017, మంగళవారం

చిన్ని సిరిమువ్వలు

  • ఒక మనిషిని బలవంతపెట్టి లేదా వారి బలహీనతను అడ్డుగా పెట్టి చేయించిన పని యొక్క ఫలితం ఎప్పుడూ సరిగా ఉండదు. 
  • అడిగితే లోకువ అయిపోతాను అనే ఒకే ఒక్క విషయం మనిషిని గమ్యం చేరే మార్గానికి ఆలస్యం చేస్తూ ఉంటుంది. 
  • ప్రతి బుద్ధికి తెలిసే ప్రపంచం ఆయా బుద్ధి యొక్క దృష్టికోణమే. 
  • మనిషి మాట్లాడే చాలా మాటలు తను వినేటపుడు కానీ, చదివేటపుడు కానీ ఇష్టపడడు. 
  • చేరుకున్న గమ్యం కన్నా చేరడానికి వచ్చిన దారి ముఖ్యం, చేసిన పని కన్నా దాని వెనుక దాగి ఉన్న ఉద్దేశం ముఖ్యం, వేయి వేల మాటల కన్నా సరైన సమయంలో మౌనం ముఖ్యం. 
  • మెప్పును తేనె లాగ తాగే మనిషి తన ప్రజ్ఞపై ప్రశ్నకి చెదిరిపోయి చిన్నబోతాడు, తనంతవాఁడు లేడు అంటే ఉప్పొంగిపోయే మనిషి "నువ్వు ఎవరు" అని అడిగితే ఉక్కిరి బిక్కిరి అవుతాడు. 




హే నిరాకార నిర్గుణా సదా స్మరామి

ధ్యానింప ధ్యానింప దేవాధిదేవా ధ్యానింప
గా నిను హృదయ కమలాన వెలిగింప
మనితమైనది సర్వమేకరూపమని
హే నిరాకార నిర్గుణా సదా స్మరామి

ఆత్మజ్ఞానమై అంకురించవే

ఎక్కడిదో ఎప్పటిదో ఎవరెవరిని దాటి నను వచ్చి చేరినదో 
నిట్టనిలువునా నను దహించే దుఃఖాగ్ని 
తనువున అణువణువునా రగులుతున్న శోకాగ్ని 
అశ్రుజలాలకు చల్లారని ఆవేశపు వేదనాగ్ని 
కాలమాపలేని కుదురులేని మనసున 
ఉవ్వెత్తున ఎగసి పడే బడబాగ్ని 
చిత్రమేమిటని కులుకుతున్న నేత్రాల 
దృశ్యాలను దాటలేని కాంక్షాగ్ని 
ఆపవే ఆపవే ఆత్మజ్ఞానమై అంకురించవే 
శాంతినీయవే శాంతినీయవే


అ నుంచి ఆ వరకూ

ప్రక్క ప్రక్కనే ఉన్నట్లు అనిపించే నుంచి వరకూ చేసే
ఈ ప్రయాణంలో
ఎన్ని వేల జన్మలో
ఎన్ని కోట్ల బాధలో
దగ్గరున్న దూరమిది
సూక్ష్మమైన శూన్యమిది
లోపలున్న బయలిది
వేదనైన వేడుకిది
విడదీయని దారానికి కోట్ల కొద్దీ పువ్వులు
వాడిపోయి వికసించి, వికసించి వాడిపోయి
వేళ వచ్చినంతనే వేడుకగా నిను చేరి
వివేకమై విరిసి వేరు కాని శాంతి పొందగలవు